*సర్వాపూర్ లో చెరువును తలపిస్తున్న ప్రధాన రహదారి – రాకపోకలకు తీవ్ర అంతరాయం*
*- పట్టించుకోని అధికారులు, తీవ్ర ఇబ్బందుల్లో గ్రామస్తులు*
*మల్యాల, సెప్టెంబర్ 24, (ప్రజావాణి):* మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో ప్రధాన రహదారి పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా గుంతలమయమై, బురదమయంగా మారి చెరువును తలపిస్తోంది.
గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారిలో భారీ గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైకులు, ఆటోలు, కార్లు బురదలో చిక్కుకుపోతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థులు రోడ్డుపై నడవాలంటే భయపడుతున్నారు.
ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సర్వాపూర్ ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయించి, గుంతలు పూడ్చి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

