జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు మంతెన కిరణ్-మమత దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు మంతెన యశ్వంత్ విషజ్వరంతో కన్నుమూశాడు. గత మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న యశ్వంత్‌ను తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో యశ్వంత్ ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమారుడు అకస్మాత్తుగా అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో ఎండపల్లి గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

