*రైతుల వరి పొలాల సందర్శన – క్షేత్రస్థాయి అవగాహన వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర*
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజావాణి
మండల వ్యవసాయ అధికారి దండెం. విజయచంద్ర, మంగళవారం గుమ్మరిగూడ గ్రామంలో అంజయ్య, హరికృష్ణ, క్రిష్ణయ్య రైతుల వరి పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, ప్రస్తుత వరి పంటల పరిస్థితిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మండల రైతులకు వరి పంటలో వచ్చే ప్రధాన చీడపీడలు మరియు తెగుళ్లను గుర్తించే విధానం, వాటి వల్ల కలిగే నష్టాలు మరియు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది. వరి పంటలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, గోధుమరంగు దోమ తదితర చీడపీడలను గుర్తించే లక్షణాలను వివరించడం జరిగింది. అగ్గితెగులు, బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు తదితర తెగుళ్ల లక్షణాలను రైతులకు వివరించడం జరిగింది.
కాండం తొలిచే పురుగు:
లక్షణం: పిలకల దశలో మధ్య ఆకులు ఎండిపోయి సులభంగా బయటకు రావడం – డెడ్ హార్ట్స్, కంకి దశలో తెల్ల కంకులు కనిపిస్తాయి.
నివారణ: పొలాన్ని తరచుగా పరిశీలించి, ఆర్థిక నష్టం స్థాయి దాటినప్పుడు మాత్రమే మందు పిచికారీ చేయాలి.
రసాయన మందు:
ఫ్లుబెండియామైడ్ 20శాతం డబ్ల్యూజి 50 గ్రా/ఎకరం, లేదా
కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50శాతం ఎస్.పి 400 గ్రా/ఎకరానికి పిచికారీ చేసుకోవాలి,
ఆకుముడత పురుగు:
లక్షణం: పురుగు ఆకులను ముడిచి లోపల ఉండి పచ్చని భాగాన్ని తింటుంది. ఆకులపై తెల్లటి/పారదర్శక గీతలు కనిపిస్తాయి. రసాయన మందులలో ఏదో ఒకటి పిచికారీ చేయాలి క్లోరాంట్రానిలిప్రోల్ 18.5శాతం ఎస్.సి50 మి.లీ/ఎకరం, లేదా ఫ్లుబెండియామైడ్ 20 శాతం డబ్ల్యూజి-50 గ్రా/ఎకరం, లేదా
కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50శాతం ఎస్.పి-400 గ్రా/ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
గోధుమరంగు దోమ:
లక్షణం: మొక్క అడుగు భాగంలో నీటి మట్టానికి సమీపంగా గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. ఎక్కువగా సోకితే మొక్కలు పసుపురంగులోకి మారి హాపర్ బర్న్ కనిపిస్తుంది.
నివారణ: అధిక నత్రజని వాడకాన్ని నివారించాలి; పొలంలో నీటిని పూర్తిగా నిల్వ ఉంచకుండా అవసరమైనప్పుడు నీరు తీసివేయాలి.
రసాయన మందు: బుప్రోఫెజిన్ 25శాతం ఎస్ సి-320 మి.లీ/ఎకరానికి పిచికారీ చేసుకోవాలి,
అగ్గితెగులు:
లక్షణం: ఆకులపై మధ్యలో బూడిదరంగు, అంచుల్లో ముదురు గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. కంకి మెడ భాగానికి సోకితే నెక్ బ్లాస్ట్ వస్తుంది, రసాయన నివారణ – ఏదో ఒకటి:
ట్రైసైక్లోజోల్ 75శాతం డబ్ల్యూపి-500 గ్రా/హెక్టారు, లేదా ఐసోప్రోథియోలేన్ 40శాతం ఈసి-750 మి.లీ/హెక్టారు, లేదా అజోక్సిస్ట్రోబిన్ 25శాతం ఎస్.సి- 500 మి.లీ/హెక్టారుకు పిచికారీ చేయాలి,
బ్యాక్టీరియా ఆకు ఎండుతెగులు:
లక్షణం: ఆకుల అంచులు/చివరల నుంచి పసుపు రంగులోకి మారి క్రమంగా ఎండిపోతాయి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.
నివారణ: అధిక నత్రజని వినియోగాన్ని నివారించడం, పొలంలో సరైన నీటి యాజమాన్యం పాటించడం మరియు వ్యాధి సోకిన పొలంలో అనవసరంగా ఆకులను గాయపరచకుండా చూడాలి. రసాయన సిఫార్సు: కాపర్ హైడ్రాక్సైడ్ 77శాతం డబ్ల్యూపి-1.25 కిలోలు/హెక్టారు. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మళ్ళీ మార్చి పిచికారీ చేసుకోవాలి, పొలంలో పురుగు ఉధృతి, తెగుళ్ల లక్షణాలను క్రమం తప్పకుండాపరిశీలించాని సూచించడం జరిగింది. అవసరం లేనప్పుడు పురుగుమందులు పిచికారీ చేయకుండా, ఆర్థిక నష్టస్థాయి ఆధారంగా మాత్రమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. సమతుల్య ఎరువుల వినియోగం, పొలంలో సరైన నీటి యాజమాన్యం మరియు కలుపు నివారణ ద్వారా పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించడం జరిగింది.

