📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమెడిసిటిలో ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

మెడిసిటిలో ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం

📰 Generate e-Paper Clip

ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘనపూర్ లో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘన్‌పూర్‌లోని మెడిసిటి కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో మంగళవారం పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపీ విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడంతో పాటు, ఫిజియోథెరపీ ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథి డా.సి.మల్లికార్జున రెడ్డి, అకడమిక్ డైరెక్టర్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమంలో డా.మహమ్మద్ రఫి, ప్రిన్సిపల్,మెడిసిటి కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ, డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ రీసెర్చ్, షేర్ ఇండియా, డా.రామ్ కళ్యాణ్, హెడ్, ఆర్థోపెడిక్ విభాగం, మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రొఫెసర్ ఎస్. హైమావతి, ప్రిన్సిపల్, మెడిసిటి కాలేజీ ఆఫ్ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డా. రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో ఫిజియోథెరపీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. వివిధ వ్యాధులకు వైద్య చికిత్స అందించిన అనంతరం రోగులు తిరిగి శారీరకంగా సాధారణ స్థితికి చేరుకోవడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. డా.మహమ్మద్ రఫి మాట్లాడుతూ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా అంటువ్యాధులు కాని వ్యాధుల చికిత్సలో ఫిజియోథెరపీ పోషిస్తున్న కీలక పాత్రపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. 2026 ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో ఫిజియోథెరపీ ప్రాధాన్యతపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

ముఖ్య అతిథి డా. సి. మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ఫిజియోథెరపీ చికిత్సా విధానం ఎంతో ప్రాచీనమైనదైనా, ప్రస్తుతం ఆధునిక శాస్త్రీయ విధానాలతో అభివృద్ధి చెందిందన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే, వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. శారీరక, మానసిక ఆరోగ్యంలో వచ్చే మార్పులు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం అధ్యాపకులు, విద్యార్థులు ఫిజియోథెరపీపై ప్రసంగాలు చేశారు. విద్యార్థులు ప్రత్యేక స్కిట్లను ప్రదర్శిస్తూ ఫిజియోథెరపిస్టులు అందించే వివిధ చికిత్సా విధానాలను ప్రదర్శించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది, ఫిజియోథెరపీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.