ములుగు జిల్లా ప్రతినిధి(ప్రజావాణి)
ములుగు జిల్లాలో అమాయక ఆదివాసీ రైతులను నమ్మించి ఓ ప్రైవేట్ విత్తన కంపెనీ నట్టేట ముంచింది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కింటాకు 12 వేల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పి లక్షల్లో మోసానికి పాల్పడింది.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం శివాపూర్ గ్రామానికి చెందిన అమాయక ఆదివాసీ రైతులే ఈ మోసంలో బాధితులు. US RH Agree Seeds కంపెనీ పేరుతో ఆర్గనైజర్ తోట రాజు, సబ్ ఆర్గనైజర్ మదారి సంపత్ రైతుల వద్దకు వచ్చారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చెప్పారు. కంపెనీ తరఫున విత్తనాలు ఇచ్చి పంట వేయించారు.
పంట చేతికొచ్చాక కంపెనీ మాట మార్చింది. అనుకున్న దిగుబడి రాలేదు, అనుకున్న డబ్బులు ఇవ్వలేదు. రైతులు తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆర్గనైజర్లను నిలదీశారు. దీంతో ఆర్గనైజర్ తోట రాజు, సబ్ ఆర్గనైజర్ మదారి సంపత్ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చేసేదేమీ లేక బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
అసలు ఈ ఘటన గత ఏడాది మే నెలలోనే జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ఏకంగా మంత్రి సీతక్కను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నా ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమాయక గిరిజన రైతులను మోసం చేసిన US RH Agree Seeds కంపెనీపై, ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలా విత్తన కంపెనీలు మోసాలకు పాల్పడితే ఎలా? అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

