బద్వేల్:వైఎస్ఆర్ కడప జిల్లా సెప్టెంబర్ 26ప్రజావాణి కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె రెవెన్యూ పరిధిలో దళితులు, పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేల్ రెవెన్యూ అధికారి ఆర్డీఓ చంద్రమోహన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. వివాదాస్పద భూములకు సంబంధించి కోర్టు పరిధిలో ఉన్న 8 ఎకరాల భూమిని మినహాయించి, మిగిలిన అన్ని ప్రభుత్వ భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకుంటుందని ఆయన ప్రకటించారు. శనివారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ యంబడి పోలయ్య కాశి నాయన మండల అధ్యక్షులు బాబు కేవీపీఎస్ నాయకులు బాల ఓబయ్య లు ఆర్డీఓ చంద్రమోహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో ఆయన సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రమోహన్ నీళ్ళు.. “నాయనపల్లె రెవెన్యూ భూముల్లో దళితుల హక్కులను కాలరాసేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదు. కోర్టు స్టే ఉన్న 8 ఎకరాలను పక్కన పెట్టి, మిగిలిన వివాదాస్పద ప్రభుత్వ భూములన్నింటినీ రెవెన్యూ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంటుంది. నిబంధనలను అతిక్రమించి భూ ఆక్రమణలకు పాల్పడితే నేను స్వయంగా క్షేత్రస్థాయికి (ఫీల్డ్ మీదికి) వచ్చి కఠినమైన చర్యలు తీసుకుంటాను. ఆయా భూముల్లో ప్రభుత్వ బోర్డులను నాటతాం” అని స్పష్టం చేశారు.
భూ కబ్జాదారులను అరెస్టు చేయాలి ప్రజా సంఘాల డిమాండ్
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి వెంకటేష్ బాలయ్య కాశినాయన మండలం అధ్యక్షులు వరికుంట్ల బాబు బాల ఓబయ్య నేతృత్వంలో నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె రెవెన్యూ పొలంలోని సర్వే నెంబర్లు 129, 130, 217లలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను 2018 సంవత్సరం నుండి వరికుంట, నాయనపల్లె గ్రామాలకు చెందిన పేదలు, దళితులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురిచేసి, రాజకీయ రంగు పూసి, అగ్రవర్ణాలకు చెందిన కొందరు వైసీపీ నాయకులు ఈ భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. గత ఐదు రోజులుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు తమ భూముల్లోకి వెళ్తుండగా, గ్రామీణ ధనిక పెత్తందారులు వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ, పోలీస్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ, బాధితులైన దళితులపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
పీడీ యాక్ట్ నమోదు చేయాలి
పేద దళితులపై దాడులకు తెగబడిన వైసీపీ నాయకుడు సత్యనారాయణ రెడ్డి అలియాస్ (నల్ల సత్యం), అతని కుమారుడు గోవింద్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కఠినమైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల హామీ మేరకు తక్షణమే ఆ భూములను స్వాధీనం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో , వరికుంట, నాయనపల్లె గ్రామాలకు చెందిన దళిత, పేద బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

