బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం
అసెంబ్లీలో పోలీసుల వ్యవహారశైలి దారుణం: ఒంటెద్దు నరసింహారెడ్డి
గరిడేపల్లి, సెప్టెంబర్ 7 (ప్రజావాణి):
అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడటం అప్రజాస్వామికమని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, జుట్టు పట్టుకుని ఈడ్చడం దారుణమన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిలపై కూడా పోలీసులు దాడి చేసి గాయపరిచారని ఆరోపించిన నరసింహారెడ్డి, పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసెంబ్లీనా.. లేక కౌరవ సభనా అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోలీసుల అరాచకాలు ఇలాగే కొనసాగితే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో నేరేడుచర్ల పట్టణ, మండల నాయకులతో పాటు గరిడేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు అప్రజాస్వామికం
RELATED ARTICLES

