నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్జెండర్లతో నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా గౌరవప్రదంగా జీవించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, పండుగలు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా స్వచ్ఛందంగా అందించే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని, డబ్బులు అందించడానికి ఒత్తిడి చేయడం, బెదిరించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రజలను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి ట్రాన్స్జెండర్లపై వేధింపులు, బెదిరింపులు లేదా బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఫిర్యాదులు అందితే వాటిని పరిశీలించి, నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అదే సమయంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వేధింపులు లేదా ఇతర చట్టపరమైన సమస్యలు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, పోలీస్ శాఖ అవసరమైన సహకారం అందజేస్తుందని భరోసా ఇచ్చారు. ట్రాన్స్ఫర్లు కూడా సమాజంలో ఒక భాగమేనని, వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో వ్యవహరించాలని, అదే విధంగా వారు కూడా ప్రజల హక్కులు, భంగం కలగకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని. ఈ అవగాహన కార్యక్రమంలో సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, షరీఫ్‌తో పాటు ట్రాన్స్జెండర్లు ఉన్నారు.

