పెద్దమల్లారెడ్డిలో విచ్చలవిడిగా బెల్టు షాపులు
-పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
ఊరంతా మద్యం విక్రయాలేనా..? ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
బిక్కనూరు, సెప్టెంబర్ 07: (ప్రజావాణి):
బిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో బెల్ట్ షాపుల జోరు రోజురోజుకూ పెరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతుండగా, సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ఇప్పటికే పలుమార్లు సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు, వినతిపత్రాలు అందించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ బెల్ట్ షాపుల జోరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫిర్యాదులు కాగితాలకే పరిమితమా?
గ్రామపంచాయతీ నుంచి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు పాలకవర్గం ఫిర్యాదులు చేస్తుండగా, మరోవైపు గ్రామంలో మద్యం విక్రయాలు కొనసాగుతుండటంతో అసలు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకునే బాధ్యత ఎవరిది? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పంచాయతీకి తెలియకుండా సాగుతున్నాయా?
బెల్ట్ షాపులు ఇంత బహిరంగంగా కొనసాగుతుంటే గ్రామపంచాయతీకి తెలియకుండా ఎలా నడుస్తున్నాయనే ప్రశ్నలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి. పంచాయతీకి అన్నీ తెలిసే జరుగుతున్నాయా? లేక అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది.
ఇప్పటికైనా గ్రామపంచాయతీ పాలకవర్గం బెల్ట్ షాపులపై మరింత కఠినంగా వ్యవహరించి, సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలంతా ఏకమై జిల్లా కలెక్టర్‌ను కలిసి బెల్ట్ షాపులపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బెల్ట్ షాపుల జోరుకు అడ్డుకట్ట ఎప్పుడు?
ప్రజల ఫిర్యాదులకు పరిష్కారం ఎప్పుడు?
పంచాయతీ, ఎక్సైజ్ శాఖలు ఇకనైనా మేల్కొంటాయా? అనే ప్రశ్నలు పెద్దమల్లారెడ్డి గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి.


