📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనిర్వాహకుడి నిర్లక్ష్యానికి డ్రైవర్‌ బలి....11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి భాను ప్రసాద్‌ మృతి

నిర్వాహకుడి నిర్లక్ష్యానికి డ్రైవర్‌ బలి….11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి భాను ప్రసాద్‌ మృతి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 8: గణేష్‌ విగ్రహ తరలింపులో నిర్వాహకుడి నిర్లక్ష్యం ఓ డ్రైవర్‌ ప్రాణాన్ని బలిగొంది. 11 కేవీ హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు గణేష్‌ విగ్రహం తగలడంతో విద్యుదాఘాతానికి గురైన డ్రైవర్‌ భాను ప్రసాద్‌ అశోక్‌ (28) చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7న ఘన్‌పూర్‌ నుంచి అల్వాల్‌కు గణేష్‌ విగ్రహాన్ని తరలించేందుకు భాను ప్రసాద్‌ లేలాండ్‌ వాహనం (TG10T6203) నడుపుతూ బయలుదేరాడు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో మార్గంలో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్‌ తీగలను గమనించిన డ్రైవర్‌ ప్రమాదం పొంచి ఉందని నిర్వాహకుడు శరత్‌ యాదవ్‌కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, ప్రమాదాన్ని నివారించాల్సిన నిర్వాహకుడు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పడంతో విగ్రహం విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో వాహనం మొత్తం విద్యుత్‌ ప్రవాహానికి గురైంది. ప్రాణభయంతో వాహనం నుంచి దిగేందుకు ప్రయత్నించిన భాను ప్రసాద్‌కు తీవ్ర విద్యుదాఘాతం తగిలి సుమారు 60 శాతం కాలిన గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్‌ 8న తెల్లవారుజామున 1.30 గంటలకు మృతి చెందాడు. మృతుడి తమ్ముడు తరుణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రాణాలకే ముప్పు

గణేష్‌ విగ్రహాల తరలింపులో నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించారు. విగ్రహం ఎత్తు, రవాణా మార్గాన్ని ముందుగానే పరిశీలించి విద్యుత్‌ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల లైన్‌ క్లియరెన్స్‌ తీసుకున్న తర్వాతే విగ్రహాలను తరలించాలని స్పష్టం చేశారు.

11 కేవీ, 33 కేవీ విద్యుత్‌ తీగలకు విగ్రహం తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇనుప పైపులు, పచ్చి కర్రలతో తీగలను సర్దే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహనం నుంచి ప్రమాదకరంగా కిందికి దిగరాదని సూచించారు.

నిర్వాహకుల నిర్లక్ష్యం పునరావృతం కాకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. పండుగ ఉత్సాహం పేరుతో భద్రతను విస్మరిస్తే మూల్యం ప్రాణాలతో చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.