*ధర్మ జాగరణ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ప్రారంభం*
*వారం రోజుల పాటు మందమర్రి శ్రీ హరిహర అయ్యప్ప దేవాలయంలో శిక్షణ*
*ఆగమ శాస్త్రోక్తంగా పూజా విధానాలపై అర్చకులకు అవగాహన*
*మన ప్రజావాణి*
మందమర్రి
గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ధర్మ జాగరణ తెలంగాణ ప్రాంతం, మంచిర్యాల జిల్లా (కరీంనగర్ విభాగం) గ్రామ దేవాలయ అర్చక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ఆదివారం ఘనంగా
ప్రారంభమయ్యాయి.
మందమర్రి మార్కెట్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న శ్రీ హరిహర అయ్యప్ప దేవాలయ ప్రాంగణంలో ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణా తరగతులునిరంతరాయంగా కొనసాగనున్నాయి.
ఆగమ శాస్త్రోక్తంగా పూజా విధానాలు:
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామాల్లోని ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావని, అవి గ్రామీణ సమాజానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలని పేర్కొన్నారు. గ్రామ దేవాలయాల్లో నిత్య ధూప, దీప, నైవేద్యాలు లోటు లేకుండా నిర్వహించడంతో పాటు, అర్చకులకు ఆగమ శాస్త్రోక్తంగా పూజా విధానాలు, మంత్రోచ్ఛారణలు, ప్రాచీన సంప్రదాయాలపై ఈ వారం రోజుల్లో సమగ్ర శిక్షణ అందించనున్నట్లు వివరించారు. అర్చకుల నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఆలయాల విశిష్టతను కాపాడవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో ధర్మ జాగరణ ప్రతినిధులు, అర్చక పరిషత్ బాధ్యులు,శ్రీ హరి హర దేవస్థాన గౌరవ అధ్యక్షులు బర్ల సదానందం, కోశాధికారి, కొమ్ము రాజేష్, వాల్సా సదానందం, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అర్చకులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

