*దళిత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*
టేక్మాల్, సెప్టెంబర్ 29: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7న నిర్వహించనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను మంగళవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దళిత జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని జర్నలిస్ట్ నాయకులు పిలుపునిచ్చారు.
దళిత జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి దళిత జర్నలిస్టుకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించాలని, కుటుంబ వైద్య ఖర్చులకు పరిమితి లేకుండా వైద్య సౌకర్యం కల్పించాలని అన్నారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఉచిత బస్, రైలు పాస్‌లు అందించాలని, దళిత జర్నలిస్టులకు అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. పత్రికలు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వాలని, సీనియర్ దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని కోరారు.
దళిత జర్నలిస్టులు అకాల మరణం చెందితే రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, నిరుద్యోగ దళిత జర్నలిస్టులకు నెలకు రూ.15 వేల నిరుద్యోగ భృతి అందించాలని, ప్రెస్ అకాడమీ చైర్మన్, సభ్యులుగా దళిత జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టులు రాజు, బుచ్చయ్య, బాగయ్య, నరేందర్, ప్రేమ్‌కుమార్, కుమార్, మోహన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన టేక్మాల్ మండల ఇన్చార్జి బొబ్బిలి సుధాకర్ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

