తిరుమల బ్రహ్మోత్సవాల వేళ రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు
61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సుల తనిఖీ.. రూ.6 లక్షల జరిమానా
టోల్‌గేట్ల వద్ద ‘స్టాప్ అండ్ వాష్’ ద్వారా డ్రైవర్లకు అవగాహన
తిరుపతి, సెప్టెంబర్ 15:
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున భక్తులు, ప్రయాణికుల సురక్షిత రాకపోకల కోసం రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక రహదారి భద్రతా చర్యలు చేపట్టాయి. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాలతో రాత్రివేళల్లో ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతున్నాయి.
గత పది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేసి తనిఖీ రసీదులు నమోదు చేశారు. ఇందులో పర్మిట్ లేని 3 వాహనాలు, వాణిజ్య సరుకు తరలిస్తున్న 18 వాహనాలు, అధిక చార్జీలు వసూలు చేస్తున్న 4 వాహనాలు, మోటార్ వాహన నిబంధనలు ఉల్లంఘించిన మరో 36 వాహనాలపై కేసులు నమోదు చేసి మొత్తం రూ.6 లక్షల జరిమానా విధించారు.
ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం
తనిఖీల ఉద్దేశం కేవలం కేసులు, జరిమానాలకు పరిమితం కాదని, ప్రమాదాలను ముందుగానే నివారించడం, డ్రైవర్లలో రహదారి భద్రతపై అవగాహన పెంచడమే ప్రధాన లక్ష్యమని DTO కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు.
సుదీర్ఘ దూరం ప్రయాణించే డ్రైవర్లు నిద్రమత్తు లేదా అలసటతో వాహనాలు నడపకూడదని అధికారులు సూచించారు. అవసరమైనప్పుడు వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో నిలిపి విశ్రాంతి తీసుకోవాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
‘స్టాప్ అండ్ వాష్’తో అవగాహన
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది రాత్రివేళల్లో ప్రధాన రహదారులు, టోల్‌గేట్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యటిస్తున్నారు. వాహనాలను నిలిపి డ్రైవర్లతో మాట్లాడి ‘STOP & WASH’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
నిద్రమత్తుగా ఉన్న డ్రైవర్లు వాహనం నడపకుండా కొద్దిసేపు ఆగి ముఖం కడుక్కోవడంతో పాటు అవసరమైతే విశ్రాంతి తీసుకున్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. “నిద్ర వస్తే డ్రైవింగ్ వద్దు.. కొన్ని నిమిషాలు ఆగండి – ఒక ప్రాణాన్ని కాపాడండి” అనే సందేశాన్ని డ్రైవర్లకు అందిస్తున్నారు.
అదేవిధంగా రహదారులపై అనధికారికంగా వాహనాలు నిలిపిన సందర్భాల్లో పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది తక్షణమే స్పందించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
సమన్వయంతో ముందస్తు చర్యలు
తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి–తిరుమల మార్గాల్లో వేలాది వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో రహదారి భద్రతకు అధికారులు ముందస్తు ప్రాధాన్యత ఇస్తున్నారు.
“కొన్ని నిమిషాలు ఆలస్యం కావడం కంటే నిద్రమత్తుగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురికావడం చాలా ప్రమాదకరం. అవసరమైనప్పుడు వాహనాన్ని సురక్షితంగా నిలిపి విశ్రాంతి తీసుకోవాలి. డ్రైవర్ తీసుకునే చిన్న జాగ్రత్త ఒక కుటుంబాన్ని విషాదం నుంచి కాపాడగలదు” అని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు డ్రైవర్లకు సూచించారు.
ఈ ప్రత్యేక తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, దామోదర్ నాయుడు, మోహన్ కుమార్, అతికా నాజ్, రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాల వేళ రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు
RELATED ARTICLES

