*చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి – బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిన సీఈసీ*
*‘ఓటు చోరీ’ ఆరోపణలపై జనగామ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ – నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు, ఓటర్ల పేర్ల తొలగింపు, ‘ఓటు చోరీ’ ఆరోపణలపై ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది.
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు, దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
“ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు సురక్షితంగా ఉండేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలి. ఎస్ఐఆర్ (SIR) పేరుతో ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు తొలగించారు, ఎందుకు తొలగించారు, ఏ విధానాన్ని అనుసరించారు అనే విషయాలపై పారదర్శకత లేదు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి.
ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తోంది. ‘ఓటు చోరీ’పై సమగ్ర విచారణ జరగాలి. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీసభ్యులు, వైటిడిఏ సభ్యులు డాక్టర్ లకావత్ లక్ష్మినారాయణ నాయక్, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొర్మాల వెంకటేశ్వర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, డీసీసీ, టీపీసీసీ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

