*గోనేమ్మ బస్తీలో గణపయ్యకు ఘన పూజలు*
*నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల సందడి..
*ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి
పటాన్‌చెరు, సెప్టెంబర్ 21 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని గోనేమ్మ బస్తీలో గోనేమ్మ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, కాలనీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణపయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గోనేమ్మ యూత్ సభ్యులు ఎమ్మెల్సీ అంజిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతన అధ్యక్షుడిని సైతం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ గోనేమ్మ బస్తీతో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందన్నారు. బస్తీ ప్రజలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలంతా ఐకమత్యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో గోనేమ్మ బస్తీ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, తీర్థప్రసాదాల పంపిణీ తదితర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో కోలుకూరి రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మున్నూరుకాపు కుల సంఘం ప్రతినిధులు, కాసాల శంకర్, మైలారం సత్యనారాయణ, కాసాల యాదయ్య, నాయకోటి భూపాల్, మేకల జగదీశ్, మహేష్, సతీష్, మేకల నందు, శీను, మిట్టు, గోనేమ్మ యూత్ సభ్యులు, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

