గ్రామీణ క్రీడా ప్రతిభకు జిల్లా స్థాయిలో వేదిక
*కోదాడ, సెప్టెంబర్ 26 (ప్రజావాణి*): నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంట్రా-డిస్ట్రిక్ట్ అండర్-14 క్రికెట్ పోటీలు శనివారం కోదాడ క్రికెట్ అకాడమీ మైదానంలో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ తదితర ప్రాంతాలకు చెందిన యువ క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు.రాబోయే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్‌కు నల్గొండ జిల్లా జట్టును ఎంపిక చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ మ్యాచ్ నల్గొండ ‘ఈ’ జట్టు, నల్గొండ ‘హెచ్’ జట్ల మధ్య జరిగింది.
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, చిన్న వయసు నుంచే ప్రతిభను పెంపొందించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. కోదాడలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్న అకాడమీ కోచ్ షేక్ సిద్ధిఖ్‌ను అభినందించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులను గుర్తించి శిక్షణ, పోటీ అనుభవం కల్పించడమే అసోసియేషన్ లక్ష్యమని కోచ్ సయ్యద్ షఫీ ఉద్దీన్ తెలిపారు. జిల్లా జట్టు వివిధ లీగ్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందన్నారు. కోదాడ క్రికెట్ అకాడమీ గ్రామీణ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు సాదిక్, మహేశ్వరి, అర్హన్, చాణిక్య, క్రీడాకారులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

