ఎస్సై హామీతో దీక్ష విరమించిన నాగరాజు
30 గంటల ఆమరణ నిరాహార దీక్షకు తెర..
నెల రోజుల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని హామీ.
ఇల్లంతకుంట, ప్రజావాణి
అనంతరం బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అక్కెం నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం మధ్యాహ్నం ఎస్సై ఉపేంద్రచారి హామీతో విరమించారు. 30 గంటలపాటు కొనసాగిన దీక్ష అనంతరం ఎస్సై ఉపేంద్రచారి నాగరాజుకు జ్యూస్ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు అసంపూర్తిగా ఉన్న పనులను నెల రోజుల్లోగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో నాగరాజు దీక్ష విరమించేందుకు అంగీకరించారు.
హామీ అమలు కాకపోతే మళ్లీ పోరుబాటే
నెల రోజుల్లోగా బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే మరోసారి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అక్కెం నాగరాజు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీకి కట్టుబడి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
పదేళ్లుగా అసంపూర్తిగానే
అనంతారం బిక్కవాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు పదేళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి అందుబాటులోకి రాకపోవడంతో విద్యార్థులు, రైతులు, వృద్ధులు సహా ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇకనైనా పనులను వేగవంతం చేసి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
మండుటెండలో గొడుగులతో నిరసన
నాగరాజు దీక్షకు మద్దతుగా అనంతారం గ్రామ యువకులు మండుటెండలో గొడుగులు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. రెండు రోజులుగా కొనసాగిన దీక్షకు పలువురు నాయకులు సంఘీభావం ప్రకటించారు. బీజేపీ నాయకులు స్వామి, హరీష్, శ్రీనివాస్ దీక్షా శిబిరాన్ని సందర్శించి నాగరాజుకు మద్దతు తెలిపారు.
అధికారులను నిలదీసిన నాగరాజు

“పదేళ్లు గడిచినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయరా?” అంటూ నాగరాజు అధికారులను ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నిర్మాణ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. “రోడ్లు వద్దు.. ఓట్లు ముద్దు” అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమూటం రాములు, వొల్లల వెంకటేష్, బొల్లం వెంకటేష్, ఆకుల శ్రీనివాస్, బట్టి క్రాంతి, కదం జయంత్,అక్కెం ఉపేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు బూమల్ల అనిల్, బడుగు రమేష్ మచ్చ ప్రభాకర్, మల్యాల రాజశేఖర్,బొల్లం శ్రీకాంత్, బట్టి చంద్రమౌళి చల్ల ఆంజనేయులు, గోనేపెల్లి వెంకటేష్, విజయ్, రవి, రాకేష్, వేలుమల హరీష్ శ్రీకర్, సురేందర్, చంద్రం, హరి కృష్ణ రామ్, సాయి, స్వామి, వెంకటేష్ వంశీ, అవినాష్, మధు, హరీష్, పర్షి, అజయ్,తదితరులు పాల్గొన్నారు.

