*ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ నిరసన అర్థరహితం: పాతూరి సుధాకర్ రెడ్డి
*
*ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌పై బీజేపీ రాష్ట్ర నాయకుడి విమర్శలు*
మేడ్చల్: సార్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసనపై బీజేపీ రాష్ట్ర నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియల నేపథ్యంలో ప్రస్తుత సార్ ను వ్యతిరేకించడం “దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని” ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని, చట్టపరమైన నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా సార్ ప్రక్రియను నిర్వహించారని, ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అదే చట్టపరమైన విధానాన్ని అమలు చేస్తోందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు సార్ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటూ కేంద్రంలోని బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం కూడా అందులో భాగమేనని విమర్శించారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి చోటుచేసుకున్నాయని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దేశంలో మౌలిక వసతులు, సాంకేతిక రంగం, రక్షణ, సెమీకండక్టర్లు, కంప్యూటర్ చిప్స్ వంటి రంగాల్లో ప్రగతికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రాధాన్యం ఇస్తూ దేశీయ తయారీ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తరచూ వివిధ అంశాల్లో విమర్శలు చేస్తూ మంత్రులు, అధికారుల రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు బీజేపీ-ఎన్‌డీఏ నాయకత్వాన్ని బలపరుస్తారని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు కొనసాగుతుందని పాతూరి సుధాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పాతూరి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నాయకులు

