కలసపాడు, సెప్టెంబర్ 6 ప్రజావాణి ముద్దంవారిపల్లి:ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కొనియాడారు.బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం ముద్దంవారిపల్లి గ్రామంలోని మండల పరిషత్ (ఎంపీ) ఎలిమెంటరీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న పాలకొలను శిలారెడ్డి, శ్రీమతి తాతిరెడ్డి మంజులాదేవి దంపతుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో కొందరు ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తుచేశారు.ఆ నమ్మకంతోనే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 8 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ పాఠశాలల్లో చేరడం బాధాకరమన్నారు.అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం వల్ల ఎంతోమంది సామాన్య, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని నేడు డాక్టర్లుగా,ఇంజనీర్లుగా,సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారని నాగార్జున రెడ్డి కొనియాడారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి
RELATED ARTICLES

