–ఆర్టీసీ బస్సు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు
•షాబాద్ బస్టాండ్‌లో విద్యార్థి కాలుపై నుంచి వెళ్లిన బస్సు

– నిత్యం అతివేగంతో ఆర్టీసీ డ్రైవర్లు నిర్లక్ష్యం ఈ ఘటన జరుగుతుందని ప్రయాణికులు విద్యార్థులు ఆందోళన
షాబాద్ సెప్టెంబర్ 09 రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి
షాబాద్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి కాలుకు తీవ్ర గాయమైంది. విద్యార్థి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. షాబాద్ మండలం అంతారం గ్రామానికి చెందిన జశ్వంత్ షాబాద్‌లోని మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.
బుధవారం పాఠశాల అనంతరం షాబాద్ బస్టాండ్‌లో ఉన్న సమయంలో బస్సు బస్టాండ్‌లోకి వచ్చింది. అదే సమయంలో రేగడి చిలుకమర్రి వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ముందుకు కదులుతుండగా విద్యార్థి కాలుపై నుంచి బస్సు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో జశ్వంత్ కాలుకు తీవ్ర గాయం కావడంతో కాలు విరిగినట్లు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే తోటి విద్యార్థులు, స్థానికులు స్పందించి జశ్వంత్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
బస్టాండ్‌లో బస్సులు రాకపోకలు సాగించే సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని, విద్యార్థులు, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ ఉన్న సమయంలో బస్సుల వేగాన్ని నియంత్రించడంతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించాలని, బస్టాండ్‌లో భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని విద్యార్థి కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

