అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సహచర విద్యార్థినిని పరామర్శించిన 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తమ సహచర విద్యార్థిని స్వర్ణలతను పరామర్శించి,ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు 1987-88 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు వరంగల్ జిల్లా చంద్రకొండకు వెళ్లారు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 1987-88 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన సుమారు 86 మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలతో సుఖసంతోషాలతో జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు గడిచినా తమ మధ్య ఉన్న ఆత్మీయత, స్నేహబంధాన్ని కొనసాగిస్తూ కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలుస్తున్నారు.
తమ సహచర విద్యార్థిని స్వర్ణలత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆమెను పరామర్శించేందుకు చంద్రకొండకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశలోనే పాటలు పాడుతూ, యాంకర్‌గా వ్యవహరిస్తూ పాఠశాలలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న స్వర్ణలతతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
స్వర్ణలత త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని, ఇకపై ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవించాలని 1987-88 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు
39 సంవత్సరాలు గడిచినా పూర్వ విద్యార్థుల మధ్య ఉన్న ఆత్మీయత, స్నేహబంధం ఇలాగే కొనసాగాలని, కష్టాల్లో ఉన్న సహచరులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

