📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమీరాలం కుంటలో మట్టి పూడ్చినా చర్యలేవీ?పోలీసుల తీరుపై మండిపడ్డ బాలగౌని సుమన్ గౌడ్, రావుల శ్రీకాంత్

మీరాలం కుంటలో మట్టి పూడ్చినా చర్యలేవీ?పోలీసుల తీరుపై మండిపడ్డ బాలగౌని సుమన్ గౌడ్, రావుల శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

ఘాట్‌కేసర్, ఆగస్టు 11 (ప్రజా వాణి): చెరువుల పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని యువజన నాయకులు బాలగౌని సుమన్ గౌడ్, రావుల శ్రీకాంత్ ప్రశ్నించారు. పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడలో ఉన్న చారిత్రాత్మక మీరాలం కుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో ‘బతుకమ్మ ఘాట్’ పేరుతో అక్రమంగా మట్టి పూడ్చి ఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరాలం కుంటను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులు, చెరువు పరిధిలో అక్రమంగా మట్టి పూడ్చివేతలు జరిగినా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. సామాన్యులు చిన్న తప్పు చేసినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకునే పోలీసులు, అధికార బలం, ధనబలం ఉన్న వారి విషయంలో మాత్రం కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు.

నీటిపారుదల శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎ. పరమేష్ ఆధారాలు, మ్యాప్‌లతో సహా 2024 సెప్టెంబర్ 3న పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా నేర సంఖ్య 411/2024 కింద కేసు నమోదైందని వారు తెలిపారు. కేసు నమోదై చాలా కాలం గడుస్తున్నప్పటికీ నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

చెరువుల పరిరక్షణకు సంబంధించిన చట్టాల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి పూడ్చడం, ఆక్రమణలకు పాల్పడటం తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మీరాలం కుంట ఎఫ్‌టీఎల్ పరిధిలో పూడ్చిన మట్టిని తక్షణమే తొలగించి చెరువును పూర్వస్థితికి తీసుకురావాలని, ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలగౌని సుమన్ గౌడ్, రావుల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అధికారులు ఇకనైనా స్పందించకపోతే చెరువుల పరిరక్షణ కోసం ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.