రూ. 14,730 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం.. అంతర్గాం పిఎస్‌కు నిందితుల అప్పగింత
అంతర్గాం/పెద్దపల్లి ఆగస్టు8 ప్రజావాణి :
డబ్బులు పందెంగా పెట్టి ఆడుతున్న పేకాట స్థావరంపై నార్కోటిక్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంపేట గ్రామంలో భారీగా డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారంతో ఈ దాడి జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో, ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలోని సిబ్బంది శనివారం ఈ ఆపరేషన్ నిర్వహించారు.
దాడి సమయంలో పేకాట ఆడుతూ దొరికిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 14,730 నగదుతో పాటు 52 పేకముక్కలు, 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులలో ఎన్‌టీపీసీకి చెందిన ధర్మాజీ లక్ష్మణ్ (53), పెద్దంపేటకు చెందిన లాయిశెట్టి మహేష్ (37), రామగుండంకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బంగారి నారాయణ (55), అంతర్గాంకు చెందిన ఆదిచర్ల శివ సాయి (47), పెద్దంపేటకు చెందిన మెరుగు వెంకటస్వామి (55), రామగుండంకు చెందిన మాచర్ల ఆకాష్ (42), మంథనికి చెందిన ఆసర్ల మల్లేష్ (44) ఉన్నారని పోలీసులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యలు మరియు కేసు నమోదు కోసం అంతర్గాం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడటం లేదా స్థావరాలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

