బెజ్జంకి,ఆగస్టు 21 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో మట్టి రోడ్డు గుంతలమయంగా మారడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు ద్వారా సుమారు 200 నుంచి 250 ఎకరాల వరకు రైతులు తమ వ్యవసాయ పొలాలకు రాకపోకలు సాగిస్తున్నారు.రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడటంతో పొలాలకు కూలీలను ఆటోల ద్వారా తీసుకెళ్లాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి తదితర పంటలకు యూరియా, ఇతర వ్యవసాయ అవసరాల వస్తువులను ద్విచక్ర వాహనాలపై తరలించేందుకు కూడా రోడ్డు పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తెలిపారు.వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరడంతో రాకపోకలకు మరింత ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, రైతుల ఇబ్బందులను తొలగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

