📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaకేసముద్రం 'సీఎంఆర్' స్కామ్ మూడు మిల్లుల తనిఖీతోనే సరిపెడతారా?

కేసముద్రం ‘సీఎంఆర్’ స్కామ్ మూడు మిల్లుల తనిఖీతోనే సరిపెడతారా?

📰 Generate e-Paper Clip



రూ. 6 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం.. ఆ డబ్బుతోనే కొత్త సామ్రాజ్యం?

మండలంలో 32 మిల్లులు ఉంటే.. మూడింటితోనే విజిలెన్స్ చేతులు దులుపుకుందా?

కేసముద్రం ఆగష్టు 07,ప్రజావాణి


ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడానికి, రైతులకు మద్దతు ధర కల్పించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సేకరిస్తున్న కస్టమ్ మిల్లింగ్ రైస్  కేసముద్రం మండలంలో కొందరు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తూ, కోట్లకుపడగలెత్తుతున్న కొందరు రైస్ మిల్లు యజమానుల వ్యవహారం ఇప్పుడు స్థానికంగా దావానలంలా మారుతోంది. పేదవాడి బియ్యం అక్రమంగా విక్రయించి వచ్చిన సొమ్ముతో ఏకంగా రూ. 6 కోట్ల వ్యయంతో కొత్త మిల్లులు, గోదాములు నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నా.. సంబంధిత శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

*గతంలో ఆరోపణలు వచ్చినా.. కారని విచారణ నిధులు!*

సంబంధిత రైస్ మిల్లు యజమానిపై గతంలోనూ సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి భారీ ఎత్తున అక్రమాల ఆరోపణలు వచ్చాయి. కానీ, అప్పట్లో ఉన్నతాధికారుల స్థాయిలో పూర్తి స్థాయి విచారణ జరగకుండానే ఫైళ్లు మూతపడ్డాయనే విమర్శలు ఉన్నాయి. సుమారు రూ. 6 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని, ఆ నల్లధనంతోనే ఇప్పుడు సరికొత్త గోదాముల సామ్రాజ్యాన్ని సదరు యజమాని విస్తరిస్తున్నట్లు రైతులు, స్థానిక వ్యాపారులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

*కంటిచూపు తనిఖీలు.. విజిలెన్స్ వింత పోకడలు!*

ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా కేసముద్రం మండలంలో 32 రైస్ మిల్లులు ఉన్నాయి. అధికారులు మాత్రం కేవలం మూడు మిల్లుల్లోనే నామమాత్రపు సోదాలు నిర్వహించి చేతులుదులుపుకున్నారు.ఆ మూడింటిలో రెండు మిల్లుల్లో భారీగా సీఎంఆర్ ధాన్యం అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలింది.అయితే, అత్యంత వివాదాస్పదంగా మారిన మరో మిల్లులో మాత్రం అధికారులు కంటితుడుపు తనిఖీలు చేసి, ‘క్లీన్ చిట్’ ఇచ్చేసి వెళ్ళిపోవడం వెనుక పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. దీనిపై విజిలెన్స్ విభాగం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

*మిగిలిన 29 మిల్లుల పరిస్థితి ఏంటి?*

కేవలం మూడు మిల్లులను కదిలిస్తేనే రెండు చోట్ల అక్రమాల పుట్ట బద్దలైతే.. మరి మిగిలిన 29 మిల్లుల్లో పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అన్ని మిల్లుల్లోనూ సమగ్రంగా తనిఖీలు నిర్వహిస్తే, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న మరిన్ని తిమింగలాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు నమ్ముతున్నారు.

*సమగ్ర విచారణ జరపాల్సిందే: రైతులు, వ్యాపారుల డిమాండ్.*

ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. కేసముద్రం మండలంలోని మొత్తం 32 రైస్ మిల్లుల్లోనూ ఎలాంటి పక్షపాతం లేకుండా, నిష్పాక్షికంగా సమగ్ర తనిఖీలు చేపట్టాలి. అక్రమాలకు పాల్పడిన మిల్లుల లైసెన్సులను రద్దు చేసి, రికవరీ చర్యలు చేపట్టాలి. విజిలెన్స్ అధికారులు తమ నివేదికలను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచి, ప్రభుత్వ నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని రైతాంగం, వ్యాపార వర్గాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.