జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య
చేవెళ్ల, ఆగస్టు 15 (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని అల్లవాడ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అల్లవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ లావణ్య యాదయ్య మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులకు బహుమతులు, విద్యా సామగ్రి పంపిణీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన వేషధారణ కార్యక్రమంలో విజేతలకు సర్పంచ్ లావణ్య యాదయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అలాగే గ్రామంలోని సుమారు 30 మంది పేద విద్యార్థులకు నోట్‌బుక్కులు, పెన్సిళ్లు, రబ్బర్లు తదితర విద్యా సామగ్రిని సర్పంచ్ లావణ్య యాదయ్య, రెండో వార్డు సభ్యురాలు చాకలి విజయ, మూడో వార్డు సభ్యురాలు సామ ప్రసన్న తమ సొంత ఖర్చులతో అందజేశారు. అంగన్‌వాడీలోని ఎనిమిది మంది చిన్నారులకు కూడా నోట్‌బుక్కులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు తమ వంతు సహాయం అందించడం అభినందనీయమని గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మూడో వార్డు సభ్యురాలు సామ ప్రసన్న మాట్లాడుతూ పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి నోట్‌బుక్కులు, పెన్సిళ్లు, రబ్బర్లు తదితర విద్యా సామగ్రిని అందిస్తే పేద విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు స్వీట్లు పంపిణీ
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామ సర్పంచ్ లావణ్య యాదయ్య, పాలకవర్గ సభ్యులు పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చింతకింది మధుసూదన్ రెడ్డి, రెండో వార్డు సభ్యురాలు చాకలి విజయ, మూడో వార్డు సభ్యురాలు సామ ప్రసన్న, నాలుగో వార్డు సభ్యురాలు శివగల రాధిక, ఐదో వార్డు సభ్యులు, శ్రీను, పద్మ, రామకృష్ణారెడ్డి, అల్లవాడ గ్రామ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళా సమాఖ్య సభ్యులు, అంగన్‌వాడీ టీచర్ అంజమ్మ, ఆశా కార్యకర్త మీనా, గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


