అడవి మధ్యన కొలువుదీరిన అద్భుతం.
రోజురోజుకు పెరుగుతున్న నంది విగ్రహం.
శ్రావణమాసంలో ఆదియోగి అడికేష్ లింగమయ్య దర్శనం.
శ్రావణమాసంలో శ్రీ అడికేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు.
అడవి తల్లి ఒడిలో వెలసిన స్వయంభు క్షేత్రానికి భక్తుల రాక.

కోటగిరి/ప్రజావాణి:-అడవి తల్లి ఒడిలో పచ్చని కొండల మధ్య స్వయంభుగా వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ అడికేష్ లింగమయ్య ఆలయంలో శ్రావణమాస పర్వదినాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న ఈ ఆలయంలో శ్రావణ సోమవారాలు,శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పారాయణలు,శివ సహస్రనామార్చనలు,రుద్ర నమక చమక పారాయణలు,ప్రత్యేక అలంకరణలు నిర్వహిస్తున్నా మని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.పవిత్ర శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ ఆడికేశ్ లింగమయ్య ఆశీస్సులు పొందాలన్నారు.
ఈ ఆలయం ఎక్కడ ఉంది.
కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులోని నాగేంద్రపురం గుట్టపై రెండు బండ రాళ్ల మధ్యన ఈ అతి ప్రాచీన ఆలయం వెలసింది.చుట్టూ దట్టమైన అడవి,పచ్చని ప్రకృతి మధ్య ఉండటంతో ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి భక్తి భావం, మానసిక ప్రశాంతత కలుగుతుంది.
ఈ ఆలయానికి పేరెలా వచ్చింది.
పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేది.ఒకసారి సమీప గ్రామానికి చెందిన పశువుల కాపరి గుట్టపై ఒక ఆవు ప్రతిరోజు లింగానికి పాలాభిషేకం చేస్తుండ టం గమనించాడు.ఈ అద్భుతాన్ని గ్రామస్తులకు తెలపడం తో వారు ఆ ప్రదేశంలో లింగాన్ని గుర్తించి ఆలయంగా ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారని స్థానిక పెద్దలు చెబుతారు.
ఆలయ ప్రత్యేకత.


ఇది ఒక అపురూప సృష్టి.రెండు బండ రాళ్ల మధ్య స్వయం భుగా వెలసిన లింగం ఇది.ఈ ప్రాంతంలోని పంచలింగాల లో ఇది ఒకటిగా భక్తులు కొలుస్తారు.పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రులైన నవనాథ సిద్ధులు నడియాడిన భవ్య క్షేత్రం ఇది.ఈ క్షేత్రంలో పురాతన కోనేరు,బావి కలదు. ఇక్కడి నంది విగ్రహం రోజురోజుకు పెరుగుతోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహ తరహాలోనే ఇక్కడి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం తెలంగాణలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పునర్నిర్మాణం.

గత రెండున్నర సంవత్సరాల క్రితం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని అడ్కస్పల్లి గ్రామానికి చెందిన ముమ్మలనేని రాజశేఖర్,పద్మశ్రీ వీణ దంపతులు సుమారు రూ.4 కోట్ల సొంత నిధులతో కృష్ణశిలతో అత్యంత సుందరంగా పునర్ని ర్మించారు.ప్రాచీన శిల్పకళా సాంప్రదాయం ఉట్టిపడేలా భక్తి భావం పరిఢవిల్లేలా ఈ ఆలయాన్ని తీర్చిద్దారు.
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.
ముమ్మలనేని రాజశేఖర్ దంపతులు తమ స్వంత గ్రామ శివారులో అడికేష్ లింగమయ్య గుడిని పునర్నిర్మించాలనే గొప్ప సంకల్పంతో ముక్కంటి దీక్ష పూని ఈ ఆలయాన్ని భవ్యంగా నిర్మించారు.నేటి నుండి ప్రారంభమైన శ్రావణ మాస పర్వదినాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరుగుతాయి.భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని పవిత్ర మాసంలో స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,కర్ణా టక,మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు విశేషంగా తరలివస్తున్నారు అని ఆలయ కమిటీ వారు తెలిపారు. పచ్చని ప్రకృతి మధ్య,ఆధ్యాత్మికతకు నిలయమైన ఈ క్షేత్రాన్ని శ్రావణ మాసంలో తప్పకుండా దర్శించి తరించాలని భక్తులకు ఆహ్వానం పలికారు.
ఆలయ పూజారి జంగం బస్వరాజు అప్పా.

తాతల కాలం నుండి ఈ ఆలయంలో పూజలు చేస్తున్నాం. శిథిలమైన ఈ ఆలయాన్ని దేవుడిలా వచ్చిన రాజశేఖర్ దంపతులు ఈ ఆలయాన్ని భవ్యంగా పునర్ నిర్మించారు. ఆయన సేవ చిరస్మరణీయం.శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని దర్శించుకోవాలనీ అన్నారు.
భక్తుడు దేగం హనుమంతు.

చిన్నప్పటి నుండి ఈ ఆలయానికి వస్తున్నాం.ఇది చాలా మహిమగల క్షేత్రం.పునర్నిర్మాణం తర్వాత ఈ ఆలయ శోభ మరింత పెరిగింది.ఈ శ్రావణమాసంలో అడికేష్ లింగమయ్య దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయని నమ్మకం.

