.విద్యుత్ ఉచ్చులో అటవీ అమరుడు – ఎఫ్.బి.ఓ నవీన్ మృతి.
.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నవీన్ కు భారీ ర్యాలీతో నివాళి.
.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి – అటవీ సిబ్బంది డిమాండ్.
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి):-
విధి నిర్వహణలో విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఎఫ్.బి.ఓ భానోత్ నవీన్ మృతికి ములుగు జిల్లా అటవీ శాఖ సిబ్బంది కన్నీటి నివాళి అర్పించారు.
పసర అటవీ శాఖ కార్యాలయంలో గురువారం రెండు నిమిషాలు మౌనం పాటించిన సిబ్బంది, అక్కడి నుండి పసర చౌరస్తా వరకు 163వ జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. “అమరవీరుడు నవీన్ అమర్ రహే” అంటూ నినాదాలతో చౌరస్తా మార్మోగింది.
ఈ ర్యాలీలో ఎఫ్.డి.ఓ వజ్రారెడ్డి, ఎఫ్.డి.ఓ కోట సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ… “నవీన్ వృత్తిరీత్యా అడవిలోకి వెళ్లి విధులు చేస్తుండగా, వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు కనిపించక కాలికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇది చాలా దారుణం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
వేట కోసం విద్యుత్ తీగలు అమర్చిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్, ఎక్సైజ్ శాఖల్లో విధి నిర్వహణలో మరణించిన వారికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం, అదే తరహాలో అటవీ అమరుడు ఎఫ్.బి.ఓ నవీన్ కుటుంబానికి కూడా కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ ములుగు అధ్యక్షులు మాట్లాడుతూ “అటవీ సిబ్బంది విధులతో పాటు స్వీయ రక్షణ, కుటుంబ భద్రత కూడా ప్రభుత్వ బాధ్యతే. లేకుంటే అడవులను కాపాడేది ఎవరు?” అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పసర, డబ్ల్యూ.డబ్ల్యూ.ఎల్.ఎం, టి. తాడ్వాయి, ములుగు, లింగాల రేంజ్ ల ఎఫ్.ఆర్.ఓలు, సంఘ సభ్యులు, ఎఫ్.బి.ఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నా గుర్తింపు రాకపోవడంపై అటవీ సిబ్బందిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

