📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థుల విజయం దేశానికి ఆదర్శం. యువత జోలికి రావద్దు – ముత్యాల ప్రసాద్ రావు, హ్యూమన్...

విద్యార్థుల విజయం దేశానికి ఆదర్శం. యువత జోలికి రావద్దు – ముత్యాల ప్రసాద్ రావు, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల జూలై 25 ప్రజావాణి నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ రావు అన్నారు. సుమారు 35 రోజుల పాటు విద్యార్థులు, యువజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు శాంతియుతంగా నిర్వహించిన నిరసన ఉద్యమం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొన్నారు.విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం ఉద్యమ విజయంగా భావించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను మరింత బలోపేతం చేయాలని కోరారు.పోటీ పరీక్షలకు విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమవుతారని, ఒక్క పేపర్ లీకేజీ వారి ఆశయాలు, భవిష్యత్తు,మానసిక స్థైర్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు బాధ్యులపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆందోళనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. శాంతియుత నిరసనల్లో విద్యార్థులపై అతిగా బలప్రయోగం చేసిన అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్యార్థులు మరియు రైతుల సమస్యలను ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. ఇకపై పేపర్ లీకేజీలు,పరీక్షల అక్రమాలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకువచ్చి,పరీక్షా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని ముత్యాల ప్రసాద్ రావు ప్రభుత్వాలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.