📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguగోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

📰 Generate e-Paper Clip

అధికారులు ముందస్తు చర్యలతో సన్నద్ధంగా ఉండాలి.

:: జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి )

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద నీటితో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు చేపల వేట, ఈత వంటి కార్యకలాపాల కోసం నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, అత్యవసర పరిస్థితులు మినహా రానున్న రెండు, మూడు రోజుల పాటు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్ 1800-425-7109కు సమాచారం అందించాలని సూచించారు.24/7 టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపడతారని పేర్కొన్నారు. మండల, జిల్లా, గ్రామ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం 75.47 అడుగులు (16.97 మీటర్లు) నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 73.32 అడుగులు (14.82 మీటర్లు), రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 74.32 అడుగులు (15.82 మీటర్లు) కాగా, ప్రస్తుతం గోదావరి నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 75.82 అడుగులు (17.32 మీటర్లు) కాగా, ప్రస్తుతం ఆ స్థాయికి అత్యంత చేరువలో ఉంది.

ప్రస్తుతం ఉన్న ప్రవాహ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.

తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు మధ్యాహ్నం 2 గంటల వరకు 14,03,500 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అంతే పరిమాణంలో నీటిని స్పిల్‌వే గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ఉందని తెలిపారు.

గోదావరి నీటిమట్టం పెరగడంతో జంపన్నవాగు, ఇతర వాగులు, లోతట్టు ప్రాంతాల్లో బ్యాక్‌వాటర్ ప్రభావం ఏర్పడే అవకాశం ఉన్నందున గతంలో ముంపునకు గురైన గ్రామాలు, ఆవాసాలు, ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

గతంలో గుర్తించిన పునరావాస కేంద్రాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, అవసరమైతే ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.

గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని గ్రామాల్లో టామ్‌టామ్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని, రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్, వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.