📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamమేడేపల్లి ఐకేపీ కేంద్రంలో రైతుల పై దోపిడీ

మేడేపల్లి ఐకేపీ కేంద్రంలో రైతుల పై దోపిడీ

📰 Generate e-Paper Clip

మేడేపల్లి ఐకేపీ కేంద్రంలో రైతుల పై దోపిడీ..?
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఎక్కడ..?
ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల నుంచి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేయాల్సిన కేంద్ర నిర్వాహకులు, మిల్లర్లు కలిసి రైతులకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రైతుల వాదన ప్రకారం, ఒక్కో ధాన్యం బస్తాలో సుమారు 42 కిలోల ధాన్యం తీసుకుంటూ, రికార్డుల్లో మాత్రం 40 కిలోలకే లెక్కలు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే “సాటేజ్ (తరుగుదల) పేరుతో 1.4 కిలోల వరకు తగ్గింపు సహజమే” అని నిర్వాహకులు సమాధానం చెబుతున్నారని రైతులు చెబుతున్నారు.
అయితే, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు ధాన్యం తూకం వేసి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసిన తరువాత జరిగే రవాణా, నిల్వ లేదా మిల్లింగ్ ప్రక్రియలో ఏర్పడే నష్టాలకు రైతులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంకా రైతులు ఆరోపిస్తున్న మరో అంశం ఏమిటంటే, ధాన్యం బస్తాలపై వేయాల్సిన సీరియల్ నంబర్లు సక్రమంగా నమోదు చేయడం లేదని, ప్రభుత్వ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే యథేచ్ఛగా కాటాలు వేస్తున్నారని అంటున్నారు. దీనివల్ల రైతులకు భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మాత్రం లారీల రవాణా సమయంలో సాటేజ్ వస్తుందని, ఒక్కో లారీకి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు తేడా వస్తుందని, ఆ నష్టాన్ని రైతులే భరించాలని చెబుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలే రైతులకు నష్టాలు మిగిల్చే పరిస్థితి ఏర్పడితే, రైతు ఎవరిని ఆశ్రయించాలి? రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామ రైతులు ప్రశ్నిస్తున్నారు.
మేడేపల్లి ఐకేపీ కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు వ్యవహారాలపై జిల్లా కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
“రైతు చెమట చుక్కకు న్యాయం ఎప్పుడు?”
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత లేకపోతే రైతుల కష్టార్జితం కొందరి జేబుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ఆవేదనకు పరిష్కారం చూపాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.