•ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం.. ఓడీఎఫ్ కాలనీలో తాగునీటి లీకేజీ పై తప్పని తిప్పలు
అమీన్పూర్, జూన్ 28(ప్రజావాణి):అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ (ODF) కాలనీలో గత 20 రోజులుగా తాగునీటి పైప్లైన్ లీకేజీ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైప్లైన్ లీకేజీ కారణంగా ప్రతిరోజూ వందల లీటర్ల తాగునీరు వృథాగా పోతుండటంతో పాటు రోడ్డుపై నీరు నిలిచి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి తాగునీటి వృథాను అరికట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.


