📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyజోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ సభ్యులు

జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ సభ్యులు

📰 Generate e-Paper Clip

అమీన్‌పూర్‌లో నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ సభ్యులు

అమీన్‌పూర్, జూన్ 24 (ప్రజావాణి):ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అమీన్‌పూర్ పరిధిలోని లక్ష్మి నివాస్, అక్షయ హోమ్స్, దుర్గా ప్రొవిన్స్ కాలనీల్లో తీవ్ర నీటి ముంపు సమస్య ఏర్పడిందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం జోనల్ కమిషనర్‌ను కలిసి సమస్యలను వివరించారు.

భారీ వర్షాల సమయంలో రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో పాటు, పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా జరిగిన నిర్మాణాలు, కాల్వలు మరియు చెరువుల ఆక్రమణలు, ప్రణాళికా రహిత అభివృద్ధి కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు పలు డిమాండ్లను వినిపించారు. లక్ష్మి నివాస్, అక్షయ హోమ్స్, దుర్గా ప్రొవిన్స్ కాలనీల నుంచి వర్షపు నీరు సజావుగా వెళ్లేలా స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. సహజ నీటి మార్గాలను అడ్డగించిన ఆక్రమణలను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల భద్రతకు భంగం కలిగించే అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అసోసియేషన్ వినతిపై స్పందించిన జోనల్ కమిషనర్, త్వరలో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ప్రభావిత కాలనీలను సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అమీన్‌పూర్ పీపుల్స్ అసోసియేషన్ నాయకులు, బాధిత కాలనీల నివాసితులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.