📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనిరుద్యోగ సంక్షోభంపై సమగ్ర విధాన మార్పులు అవసరం.  ఘనంగా ఏఐవైఎఫ్...

నిరుద్యోగ సంక్షోభంపై సమగ్ర విధాన మార్పులు అవసరం.  ఘనంగా ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం 

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, మే 3 (ప్రజావాణి):    నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే సమగ్ర విధాన మార్పులు అత్యవసరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని పోరాట దినంగా నిర్వహిస్తూ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ వద్ద ఆదివారం యువజన సంఘ జెండాను ఆయన ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ 1959 మే 3న న్యూఢిల్లీలో ఆవిర్భవించిందని తెలిపారు. ఆవిర్భావ మహాసభలో 11 రాష్ట్రాల నుంచి 250కి పైగా ప్రతినిధులు పాల్గొని, ఆరు రోజులపాటు జరిగిన సమావేశంలో అధికారికంగా సంస్థ స్థాపనను ప్రకటించారని చెప్పారు. సామ్యవాద ఆలోచనలను వ్యాప్తి చేయడం, యువతను సామాజిక మార్పు దిశగా నడిపించడం లక్ష్యంగా ఏర్పడిన తొలి యువజన సంఘం ఏఐవైఎఫ్ అని వివరించారు. అలాగే, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెమొక్రటిక్ యూత్‌తో అనుబంధం ఏర్పరచుకొని అంతర్జాతీయ యువజన ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యిందన్నారు.

ప్రస్తుతం దేశ యువత తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాకుండా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణాత్మక సంక్షోభమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ నియామకాలను తగ్గిస్తూ, ప్రైవేటీకరణను వేగవంతం చేస్తున్నాయని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతున్నాయని విమర్శించారు. విద్య ఖర్చులు పెరిగి యువతపై అదనపు భారం పడుతోందని తెలిపారు.

ఉపాధి సమస్య పరిష్కారానికి జాతీయ స్థాయిలో భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని, ప్రభుత్వ ఖాళీలను నిర్దిష్ట గడువులో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్య రంగంలో ఉచిత, నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని, ఫీజుల నియంత్రణ చేపట్టాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంతో పాటు గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కోరారు. యువత సంక్షేమం కోసం నిరుద్యోగ భృతి, మానసిక ఆరోగ్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, కార్యదర్శి టి. సత్యప్రసాద్‌లు యువత హక్కుల కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమ సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు, శేఖర్, నదీమ్, సాయిలు, ప్రతాప్, భరత్, ప్రకాష్, గణేష్, పవన్, ఏఐఎస్ఎఫ్ నేతలు మహేష్, అజీమ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.