📄 ePaper
Monday, June 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కలసపాడు జూన్ 22ప్రజావాణి:అధికారులు మారినా ఆఫీసుల్లో అవినీతి తిష్ట వేస్తూనే ఉంది.పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు కొందరు కింది స్థాయి సిబ్బందికి కాసుల కురిపించే కామధేనువులా మారాయి.వైఎస్సార్ కడప జిల్లా కలస్పాడు మండల రెవెన్యూ కార్యాలయం (MRO Office) లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నడుస్తోంది.ఇక్కడ కొందరు వీఆర్ఏలు (VRA) చెపుతున్నదే వేదంగా సాగుతోంది.ఉన్నతాధికారులను సైతం తమ చేతి ముద్రలతో శాసిస్తూ,కార్యాలయాన్ని అడ్డగా మార్చుకున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మార్వో ఆఫీసును శాసిస్తున్న వీఆర్ఏలు!సాధారణంగా మండల కార్యాలయాల్లో ఎమ్మార్వో,ఆర్ఐ ల నిర్ణయాలు ముఖ్యం.కానీ కలస్పాడు ఎమ్మార్వో ఆఫీసులో కథ అడ్డం తిరిగింది.ఇక్కడ చక్రం తిప్పుతోంది ఉన్నతాధికారులు కాదు.కొందరు వీఆర్ఏలు! కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజల అర్జీల నుండి,భూముల వివాదాల వరకు ప్రతి విషయంలోనూ వీరి జోక్యం మితిమీరిపోతోందని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.ఫైళ్లు ఎటు కదలాలో ఎవరికి ఏ పని కావాలో వీరే డిసైడ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఉన్నతాధికారులు కూడా వీరి మాయలో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా?లేక వీరి వెనుక పెద్దల హస్తం ఉందా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కార్యాలయం నీడలోనే గతంలో ఒక భారీ రేషన్ కుంభకోణం వెలుగుచూసింది.కలస్పాడు మండలం కర్ణం వారి పల్లె లోని రేషన్ షాప్ నెంబర్ 6 (డీలర్ భద్రయ్య) పరిధిలో జరిగిన అక్రమాలు గతంలో ఆ ఊరిలో చనిపోయిన వారి పేర్లు,కదలలేని స్థితిలో ఉన్న వృద్ధుల పేర్లను వాడుకుంటూ కొందరు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని కాజేశారు.చనిపోయిన వారి బయోమెట్రిక్ (ఏలిముద్రలు) ఏ విధంగా పడ్డాయనేది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.సాంకేతికతను అడ్డం పెట్టుకుని,లబ్ధిదారుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని,అర్హులైన పేదల పొట్టకొట్టి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి నల్లబజారుకు తరలించారనేది నగ్నసత్యం.

ఇంకా సాగుతున్న అక్రమాలు.నిమ్మకు నీరెత్తిన అధికారులు!

అప్పట్లోనే ఈ దందాపై సమాచారంతో సహా ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ,ఇప్పటికీ ఆ అక్రమ పరంపర గుట్టుచూడకుండా సాగుతూనే ఉందని సమాచారం. చనిపోయిన వారి పేర్లు రేషన్ లిస్టు నుండి తొలగించకపోవడం వెనుక,అలాగే లబ్ధిదారుల వేలిముద్రల దుర్వినియోగం వెనుక స్థానిక రెవెన్యూ సిబ్బంది,కొందరు వీఆర్ఏల హస్తం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.విచ్చలవిడిగా భూ దందాలు:డబ్బులిస్తే‘ఎవరి భూమి అయినా.ఎవరి పేరు మీదైనా’ ఆన్‌లైన్! రేషన్ బియ్యం దందా ఒకవైపు సాగుతుండగానే,మరోవైపు మండలంలో అత్యంత విలువైన భూముల రికార్డులను ఇష్టారాజ్యంగా మార్చేస్తూ కొందరు వీఆర్ఏలు కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కలస్పాడు మండలంలో ఏ గ్రామంలో,ఏ సర్వే నెంబర్ కావాలన్నా అది సదరు వీఆర్ఏల చేతుల్లోనే ఉండటం ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.

సర్వే నెంబర్లు వీఆర్ఏల జేబులో.డబ్బులు ఇస్తే చాలు‘ఆన్‌లైన్’!

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూముల రికార్డులను పరిశీలించి ఆన్‌లైన్ (వెబ్ ల్యాండ్ / అడంగల్) చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారులది.కానీ కలస్పాడులో మాత్రం సర్వే నెంబర్ల తాళాలు వీఆర్ఏల జేబుల్లో ఉంటున్నాయి.నిజమైన భూ యజమానులు కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా‘రికార్డులు లేవు’సర్వే నెంబర్ తప్పుంది’అంటూ సాకులు చెప్పే సదరు సిబ్బంది.అదే దళారుల ద్వారా మోటైన నోట్ల కట్టలు చేతిలో పెడితే చాలు,నిమిషాల్లో పని పూర్తి చేస్తున్నారు.డబ్బు ఇస్తే చాలు.రికార్డుల్లో అసలు యజమాని పేరు తీసేసి,అక్రమార్కుల పేర్లను ఆన్‌లైన్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సామాన్యుల గుండెల్లో రైళ్లు.కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

ఈ ఆన్‌లైన్ అక్రమాల దెబ్బకు తరతరాలుగా భూములను నమ్ముకుని బతుకుతున్న సామాన్య రైతులు, పేదలు తమ భూమి ఎప్పుడు ఎవరి పేరు మీదకు మారిపోతుందో తెలియక గుండెల్లో రాయి వేసుకుని బతుకుతున్నారు.ఒకరి భూమిని మరొకరి పేరు మీద ఆన్‌లైన్ చేసి చేతులు నలుపుకుంటున్న వీఆర్ఏల వల్లే మండలంలో వందలాది భూ వివాదాలు తలెత్తుతున్నాయి.కార్యాలయంలో న్యాయం జరగకపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్లు,కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా,మానసికంగా చితికిపోతున్నారు.

ఉన్నతాధికారుల సంతకాలు.వీఆర్ఏల కనుసన్నల్లోనేనా?

ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లను,లాగిన్ ఐడీలను కూడా ఈ వీఆర్ఏల బ్యాంగే శాసిస్తోందనే అనుమానాలు ఉన్నాయి.ఉన్నతాధికారుల డిజిటల్ సంతకాలు సైతం వీరి ప్రమేయం లేకుండా జరగడం లేదనేది బహిరంగ రహస్యం.గతంలో జరిగిన కర్ణం వారి పల్లె రేషన్ అక్రమాల నుండి. నేడు సాగుతున్న భూముల ఆన్‌లైన్ దందా వరకు అన్నింటికీ ఈ ‘వీఆర్ఏ నెట్‌వర్క్’సూత్రధారిగా మారింది.డబ్బుకు దాసోహమై సామాన్యుల పొట్టగొడుతున్న ఈ వ్యవస్థపై జిల్లా కలెక్టర్,విజిలెన్స్ అధికారులు తక్షణమే ప్రత్యేక నిఘా పెట్టాలి.లంచాలు తీసుకుని తప్పుడు ఆన్‌లైన్ చేసిన రికార్డులపై సమగ్ర రీ-సర్వే జరిపి,అవినీతి వీఆర్ఏలను తక్షణమే విధుల్లోంచి తొలగించి జైలుకు పంపాలని మండల ప్రజలు ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు,రేపటి సంచికలో పూర్తి vra పేర్లతో ప్రజల ముందుకు మీ ప్రజావాణి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular