📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiri*హైకోర్టు తీర్పును దాచి అబద్ధపు ప్రచారాలా? – ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని తెలుసుకోండి!*...

*హైకోర్టు తీర్పును దాచి అబద్ధపు ప్రచారాలా? – ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అని తెలుసుకోండి!* * *నిజం నిలకడ మీద తెలుస్తుంది.. అబద్ధం ఆర్భాటంగానే చస్తుంది* * *అన్నోజిగూడ భూములపై అసత్య కథనాలపై మండిపడ్డ యజమానులు.*  * *1955 నాటి ప్రభుత్వ తప్పును ఎత్తిచూపిన హైకోర్టు.. రికార్డులు సరిచేయాలని ఆదేశం.* * *తప్పుడు ప్రచారం చేసేవారితో బహిరంగ చర్చకు సిద్ధం – లేఅవుట్లలో పార్కు స్థలాల అమ్మకాల భాగోతం బయటపెడతాం*

📰 Generate e-Paper Clip

ఘాట్ కేసర్, జులై 31 :”అబద్ధానికి రెక్కలొస్తే ఆకాశమంత ఎగురుతుంది కానీ.. నిజం ఒక్కసారి అడుగు బయటపెడితే ఆ అబద్ధం అడ్రస్ లేకుండా పోతుంది” అన్న చందంగా తయారైంది మేడ్చల్-మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడలోని భూముల వ్యవహారం. గత కొద్ది రోజులుగా కొన్ని పత్రిక సంస్థల్లో, సామాజిక మాధ్యమాలలో అన్నోజిగూడలోని సర్వే నంబర్లు 88, 89, 90, 91, 92లలోని పట్టా భూములను ‘ప్రభుత్వ భూములు’గా చిత్రీకరిస్తూ, ‘రియల్ మాఫియా అరాచకం’ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం మరియు చట్ట విరుద్ధమని సదరు భూ యజమానులు తీవ్రంగా ఖండించారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును దాచిపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

* *అసలు నిజం ఇదే.. హైకోర్టు తీర్పు సాక్షిగా!*

“గోడకు కొట్టిన సున్నంలా” వాస్తవాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం, అన్నోజిగూడ గ్రామానికి చెందిన రైతు బాలగోని రాజయ్య (ప్రస్తుతం 85 ఏళ్లు) కు సర్వే నంబర్లు 88 నుండి 92 వరకు ఉన్న పరిధిలో మొత్తం 16.28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇది పూర్వం నుండి వారి యాజమాన్యంలోనే ఉంది. అయితే, 1955లో ప్రభుత్వం నిర్వహించిన పునఃసమీక్ష (రీ-సర్వే) లో అధికారులు తీవ్రమైన పొరపాటు చేశారు. 16.28 ఎకరాలకు బదులుగా కేవలం 11.48 ఎకరాలుగా రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారు.

 

* *అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం:*

ఈ పొరపాటును గమనించిన బాధిత రైతు ఉన్నతాధికారులను ఆశ్రయించగా, నాటి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) మరియు జాయింట్ కలెక్టర్లు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. 1955 సర్వేలో దోషం దొర్లిందని, రైతు భూమి తగ్గడం వాస్తవమేనని నిర్ధారిస్తూ సవరణల కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. అయినప్పటికీ, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారులు ఈ సవరణను వాయిదా వేస్తూ వచ్చారు. పైగా, తప్పుగా నమోదైన రికార్డుల ఆధారంగా సర్వే నంబర్ 90లోని 2.20 ఎకరాల భూమి నుండి ఖాళీ చేయాలంటూ రైతుకు నోటీసులు ఇచ్చారు. దీంతో చేసేది లేక బాధిత రైతు హైకోర్టును ఆశ్రయించారు (W.P. No. 9958/2001). ఈ కేసును విచారించిన గౌరవ జస్టిస్ బి. శేషశయన రెడ్డి, ఆర్డీవో మరియు జాయింట్ కలెక్టర్ల నివేదికలను పరిగణనలోకి తీసుకుని, సర్వేలో దోషం ఉందని స్పష్టంగా తేల్చారు. రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేస్తూ.. జిల్లా కలెక్టర్ సిఫార్సు ఆధారంగా రెండు నెలల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సర్వే & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు. అలాగే, సర్వే దోష సవరణ ప్రక్రియ ముగిసే వరకు సదరు భూమిలో పిటిషనర్ స్వాధీనతకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని అధికారులను కట్టడి చేశారు.

* *కుట్రపూరిత ప్రచారాలపై హెచ్చరిక:*

హైకోర్టు తీర్పు ఇంత స్పష్టంగా ఉంటే, కావాలనే ఆ తీర్పును దాచిపెట్టి, 2006 నాటి సేల్ అగ్రిమెంట్లను తప్పుబడుతూ, రెవెన్యూ రికార్డుల్లో 22(ఎ) నిషేధిత జాబితాలో ఉందంటూ కొన్ని శక్తులు బురదజల్లుతున్నాయి. “పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ లోకమంతా చీకటనుకున్నట్లు” వీరు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులలోని తప్పును సరిదిద్దాలని కోర్టు ఆదేశించిన తర్వాత, ఆ పాత రికార్డులనే పట్టుకుని వేలాడటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని యజమానులు ఆరోపించారు.

* *బహిరంగ చర్చకు సిద్ధం – అసలు భాగోతం బయటపెడతాం!*

తమపై, తమ పట్టా భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో ఏ వేదిక మీదనైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని భూ యజమానులు సవాల్ విసిరారు. “కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు”.. కష్టపడి భూములు కాపాడుకుంటున్న రైతు కుటుంబాలపై అభాండాలు వేస్తే ఊరుకునేది లేదన్నారు.

“ఈ చర్చలో భాగంగా, అసలు మోసగాళ్లు ఎవరో తేలుస్తాం. లేఅవుట్లలో ప్రభుత్వ నియమాల ప్రకారం ప్రజల కోసం కేటాయించాల్సిన ‘పార్కు స్థలాలను’ కూడా అమ్ముకుని, ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న భాగోతాన్ని కూడా బయటపెడతాం. అప్పుడు తెలుస్తుంది రియల్ మాఫియా ఎవరో, అరాచకం ఎవరో” అని వారు ఘాటుగా హెచ్చరించారు.

* *న్యాయం గెలుస్తుంది:*

“ధర్మం వైపే జయం” ఉంటుంది. హైకోర్టు తీర్పును గౌరవించకుండా, అసత్య వార్తలను ప్రచారం చేస్తూ, భూ యజమానుల పరువుకు భంగం కలిగిస్తున్న వారిపై చట్టపరమైన క్రిమినల్ మరియు సివిల్ చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular