*లక్ష్మి టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి*
*బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి*
* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూలై 26
జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీ టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో ఆదివారం నిర్వహించిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ సెంట్రల్ జోన్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మంచిర్యాల కార్పొరేషన్ కు అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. మంచిర్యాల ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల్లో లక్ష్మీ టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చి, గెలిచి, రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు పనులు ప్రారంభించ లేదన్నారు. లక్ష్మీ టాకీస్ – రాజీవ్ నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించక పోవడం వలన 2టౌన్ ప్రాంత ప్రజలకు నిత్యం రాకపోకలకు తీవ్ర రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, రంగ శ్రీశైలం, గోపతి రాజయ్య, బోట్ల అనిత, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, వైద్య శ్రీధర్, బోయిని హరికృష్ణ, బెల్లంకొండ మురళి, తరుణ్ సింగ్ లు పాల్గొన్నారు.

