ఘట్‌కేసర్, ఆగస్టు 6: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26వ తేదీ రాత్రి సుమారు 10:30 గంటలకు ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, పోచారంకు చెందిన కొండకళ్ళ మహేష్ (37), తండ్రి సత్తయ్య, తన హోండా యాక్టివా ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా ఘట్‌కేసర్‌లోని ఔషాపూర్ ఫార్చూన్ కీర్తి వెంచర్ సమీపంలో వాహనం అదుపు తప్పి స్వయంగా జారి పడింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు.
స్థానికుల సహాయంతో వెంటనే మేడిపల్లిలోని స్పీకర్ ఆస్పత్రికి తరలించగా, ఆయన కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, చికిత్స పొందుతూ ఆగస్టు 6వ తేదీ ఉదయం 6:26 గంటలకు గాంధీ ఆస్పత్రిలో మహేష్ మృతి చెందినట్లు విధి నిర్వహణలో ఉన్న వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.




