ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి):
మే డే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) వంటి ముఖ్యమైన రోజున కూడా కార్మికులను అక్రమంగా పనిలో నిమగ్నం చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కే వినోద్ పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆయన తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని కార్మికులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకొని, యజమాన్యం తీసుకుంటున్న ఈ అన్యాయ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కులను కాపాడాల్సిన రోజునే వారికి అన్యాయం జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. వెంటనే కార్మికులకు విశ్రాంతి కల్పించి, చట్టపరమైన నిబంధనలు పాటించాలని యజమానిని హెచ్చరించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. కార్మికుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతామని, వారి సంక్షేమం కోసం యువజన కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

