ఘట్‌కేసర్, జూన్ 11 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ వెంకటపురంలో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో జిల్లా గురుస్వాముల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఉదారి సుదర్శన్ ముదిరాజ్ అధ్యక్షత వహించగా, జిల్లా నలుమూలల నుంచి గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో శబరిమల యాత్రకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శబరిమల అయ్యప్ప సేవా సమాజం జాతీయ ప్రధాన కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు దర్శనానికి వెళ్తున్నారని తెలిపారు.
యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రవాణా, వసతి, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలను మరింత విస్తరించాలని ప్రభుత్వాలు, దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. హిందూ పండుగల సీజన్‌లో రవాణా చార్జీల పెంపు కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర మతాలకు చెందిన యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాల మాదిరిగానే హిందూ భక్తులకు కూడా సమాన గౌరవం, సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. మతపరమైన వివక్షకు తావులేకుండా అన్ని వర్గాల భక్తులను సమాన దృష్టితో చూడాలని ప్రభుత్వాలను కోరారు.
శబరిమల యాత్ర సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపడం, రైల్వే సేవలను పెంచడం, యాత్రికుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం, వృద్ధులు మరియు మహిళా భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీ చంద్రశేఖర్, తెలంగాణ నంబోద్రి ప్రదీప్, కీసర అయ్యప్ప సొసైటీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మేడ్చల్ గురుస్వామి సూర్యనారాయణ రాజు, ఉప్పల్ అన్నదాత డాక్టర్ రాజు, చౌదరిగూడ గురుస్వామి దామోదర్ రెడ్డి, ఎదులాబాద్ గురుస్వాములు రాచకట్ల కృష్ణ, అబ్బోళ్ల వెంకటేష్‌తో పాటు పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం అయ్యప్ప స్వామి శరణు ఘోషల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.





