📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సు  లైసెన్స్ లేని డ్రైవర్

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సు  లైసెన్స్ లేని డ్రైవర్

📰 Generate e-Paper Clip

*ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సు.. లైసెన్స్ లేని డ్రైవర్*



*బస్సు కింద విద్యార్థిని సహస్ర మృతి..*
షాద్ నగర్ ప్రజావాణి జూలై 24 :
రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం జరిగిన విషాద ఘటనలో యూకేజీ విద్యార్థిని సహస్ర స్కూల్ బస్సు కింద పడి మృతి చెందిన ఘటనపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలకు చెందిన ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేదని, బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని షాద్‌నగర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ స్వప్న విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎంవీఐ స్వప్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును తనిఖీ చేసి, ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక గ్రామ సర్పంచ్, ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చౌదర్‌గూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్‌ను కలిసి ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎంవీఐ స్వప్న మాట్లాడుతూ.. విద్యార్థులను తరలించే బస్సుకు పాఠశాల యాజమాన్యం ఫిట్‌నెస్ చేయించలేదని, విద్యార్థుల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌కు సైతం డ్రైవింగ్ లైసెన్స్ లేదని పేర్కొన్నారు. విద్యార్థుల రవాణా కోసం అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలకు పరిగి నుంచి రెండు బస్సులు, షాద్‌నగర్ నుంచి మరో బస్సు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పాఠశాలకు చెందిన మిగతా వాహనాల ఫిట్‌నెస్, ఇతర నిబంధనలపై కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి విచారణ చేపడతామని ఎంవీఐ స్వప్న వెల్లడించారు
చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణయ్య–మనీష దంపతుల కుమార్తె సహస్ర స్థానిక అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజులాగే శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో పాఠశాలకు వెళ్లిన చిన్నారి.. సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటి వద్దకు చేరుకుంది. చిన్నారిని ఇంటి వద్ద దించిన అనంతరం డ్రైవర్ బస్సును వెనక్కి తీస్తున్న సమయంలో వాహనం వెనుక ఉన్న సహస్రను గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular