ఘట్‌కేసర్, జూలై 15: భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మరింత పటిష్టంగా, పారదర్శకంగా, ప్రజలకు చేరువ చేసే దిశగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని తహసీల్దారు చంద్రశేఖర్ అన్నారు.
ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ చౌదరిగూడ పరిధిలోని వెంటాద్రి టౌన్‌షిప్ ఫేజ్-1, 2, 3, స్వర్ణగిరి, విజయపురి తదితర కాలనీలలో స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల, కొండాపూర్‌కు చెందిన సుమారు 40 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు బీఎల్‌వోలతో కలిసి ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయించడంతో పాటు, పూర్తయిన ఫారాలను సేకరిస్తూ ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం తహసీల్దారు చంద్రశేఖర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన పెంపొందించడం, అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరును నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం, అవసరమైన ఫారాలను సక్రమంగా నింపడంలో సహకరించడం వంటి అంశాల్లో స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ల సేవలు ఎంతో అవసరమని తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ యువత, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు ప్రజాస్వామ్య బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.
ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో స్వచ్ఛంద సంస్థల సేవాభావం కలిసివస్తేనే ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఓటరు జాబితా రూపొందుతుందని తహసీల్దారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్, ఆర్‌ఐ కావ్య, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శ్రీలత, బీఎల్‌వోలు, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శ్రీలత విజ్ఞాన్స్ కళాశాల శారీరక విద్యా సంచాలకుడు కోటేశ్వరరావు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.





