ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.1.50 లక్షల ప్రోత్సాహకం
పటాన్చెరు, జూలై 6(ప్రజావాణి): ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన 30 మంది విద్యార్థులకు ఎంకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పటాన్చెరులోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ విద్యార్థులను సత్కరించి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతి అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 550కు పైగా మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని విమానంలో తిరుపతికి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయిస్తామని ప్రకటించారు.
మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్కాడి విజయకుమార్, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ఎంకేవై ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



