పంట అవశేషాలను కాల్చడం చట్టవిరుద్ధం, రైతులు అలాంటి చర్యలకు పాల్పడవద్దు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య
వరి కొయ్యలను కాల్చిన రైతుకు 5 వేల రూపాయలు జరిమాన విధింపు
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
పంట అవశేషాలను కాల్చడం చట్ట విరుద్ధమని, రైతులు అలాంటి చర్యలకు పాల్పడవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వరి కొయ్యలను (పంట అవశేషాలను) కాల్చినందుకు బి. క్రిష్ణా రావు అనే రైతుకు గ్రామ పంచాయతీ ద్వారా 5 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
పంట కోత అనంతరం వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర పంటల అవశేషాలను బహిరంగంగా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమిలోని సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గిపోతుందని తెలిపారు. దీని ప్రభావం తదుపరి పంటల దిగుబడులపై ప్రతికూలంగా పడుతుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నప్పటికీ కొంతమంది రైతులు ఇంకా ఈ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
రైతులు పంట అవశేషాలను కాల్చకుండా కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించుకోవాలని, అలాగే ఇంధనంగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.27, పర్యావరణ, అటవీ, విజ్ఞాన సాంకేతిక శాఖ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు, పంట అవశేషాలను కాల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల మేరకు సాధారణ స్థాయిలో పంట అవశేషాలను కాల్చిన ప్రతి ఘటనకు 5 వేల పర్యావరణ పరిహారం (జరిమానా) విధిస్తారని, భారీ స్థాయిలో వ్యర్థాలు లేదా పంట అవశేషాలను కాల్చినట్లయితే 25 వేల వరకు జరిమానా విధించే నిబంధన అమలులో ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీలే ఇటువంటి ఘటనలపై పర్యావరణ పరిహారం విధించే అధికార సంస్థలుగా ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు.
రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలని, లేని పక్షంలో చట్టప్రకారం జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, భూసార సంరక్షణ, వ్యవసాయ ఉత్పాదకత పెంపు కోసం ప్రతి రైతు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు ఆ సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.




