మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల మంచాల కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. వల్లాల రేణుక సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారం అందింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సాధారణ వైద్యం, గుండె సంబంధిత సమస్యలు, స్త్రీ రోగాల వంటి విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఓల్డ్ సిటీ గోల్డ్ మాన్ సూర్య భాయ్ సహకారంతో సుమారు 50 మంది దివ్యాంగుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి నాలుగు వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సహాయం ద్వారా తన దాతృత్వాన్ని చాటుకున్న సూర్య భాయ్‌పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో సూర్య భాయ్ మాట్లాడుతూ, దివ్యాంగులకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై వచ్చే దుష్ప్రచారాలను పట్టించుకోనని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఎప్పటికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు. త్వరలో దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ఇస్తరాకులు, గ్లాసుల తయారీ యంత్రాలను అందజేయనున్నట్లు వెల్లడించారు.
పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం తమ ప్రధాన లక్ష్యమని, ఎవరైనా అవసరంలో ఉన్నవారు తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా సహాయం చేస్తానని అన్నారు. సేవలో ముందుండే వారే నిజమైన నాయకులని, ఇతరులు కూడా పేదలకు సేవ చేయడంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివ్యాంగుల కుటుంబ సభ్యులు సూర్య భాయ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన సేవా భావాన్ని అభినందించారు.


