హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇటీవల వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. పెంచిన ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో అదనపు కార్యదర్శి సరితకు ఏఐవైఎఫ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ, గతంలో రూ.200గా ఉన్న అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును రూ.1000కు పెంచడం ద్వారా నిరుద్యోగ యువతపై 400 శాతం అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500, ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000 ఫీజు నిర్ణయించడం అన్యాయమన్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, ఒకవైపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మందగమనంలో సాగుతుండగా మరోవైపు దరఖాస్తుల పేరుతో వేల రూపాయల భారం వేయడం సరికాదన్నారు. ఒకే శాఖలోని పోస్టులను కూడా వేర్వేరు నోటిఫికేషన్ల రూపంలో విడుదల చేయడంతో అభ్యర్థులు ఒక్కో నోటిఫికేషన్‌కు విడివిడిగా ఫీజులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఇటీవల రోడ్లు-భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్), కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడం వల్ల అభ్యర్థులపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. ఒక ఇంజినీరింగ్ అభ్యర్థి మూడు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తే కేవలం ప్రాసెసింగ్ ఫీజులకే రూ.3000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.
ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిరుద్యోగుల జేబులు ఖాళీ చేసే విధానాలను అవలంబించడం తగదన్నారు. పెంచిన ఫీజులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్. బాలకృష్ణ, రాష్ట్ర సమితి సభ్యుడు షేక్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.




