జిల్లా విద్యాధికారికి టీఆర్టీఎఫ్ ఘన స్వాగతం..
•• ఉపాధ్యాయుల సర్దుబాట్లు పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి.
•••గత విద్యా సంవత్సరంలో నిబంధనలు పూర్తిగా అమలు కాలేక ఇబ్బందులు.
రాజన్న సిరిసిల్ల/ప్రజావాణి
నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్యకు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ డైరీని జిల్లా విద్యాధికారికి బహుకరించి, జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ఉపాధ్యాయుల సర్దుబాట్లను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. గత విద్యా సంవత్సరంలో నిబంధనలు పూర్తిగా అమలు కాకపోవడం వల్ల పలువురు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్కూల్ కాంప్లెక్స్‌లలో ఎఫ్‌ఏసీ హెచ్‌ఎంలు పనిచేస్తున్న చోట అదనంగా ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడిని కేటాయించాలని, నార్మ్స్ ప్రకారం మొదట స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, అనంతరం సమీప మండలాల్లో, చివరిగా జిల్లా స్థాయిలో మాత్రమే సర్దుబాట్లు చేపట్టాలని కోరారు. గత ఏడాది ఇతర మండలాలకు సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను వారి స్వంత మండలాలకు లేదా సమీప ప్రాంతాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా ఎన్నికల విధులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, సంపాదిత సెలవుల (EL) ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులను నియమించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య హామీ ఇచ్చినట్లు టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఆసాని అనిల్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు మామిడాల రమేష్, గోలి రాధాకిషన్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు గుగులోతు రమేష్, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు బూట్ల శ్రీనివాస్, వేములవాడ మండల అధ్యక్షుడు కోల వినయ్ కుమార్, కోనరావుపేట మండల ప్రధాన కార్యదర్శి సుల్తాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారికి టీఆర్టీఎఫ్ ఘన స్వాగతం
RELATED ARTICLES




