అర్హులైన వారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలి: ఎంపీడీవో
చించోల్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు వేగం.
టార్ఫిన్ గుడిసెల్లో జీవనం సాగిస్తున్న 11 మంది నిరుపేద కుటుంబాలకు ప్రత్యేక దృష్టి
అర్హులందరికీ గృహలు కల్పించడమే లక్ష్యం : ఎంపీడీవో కుమారీ కే శ్రీనిధి
బీర్కూర్ : సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు శాశ్వత గృహ వసతి సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని బీర్కర్ మండలంలోని చించోలి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం బీర్కూర్ ఎంపీడీవో కుమారి కే శ్రీనిధి అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించి గృహ రహిత కుటుంబాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామంలో పూరి గుడిసెలు, టార్ఫిన్ షీట్ల తో ఏర్పాటుచేసుకొన్న తాత్కాలిక నివాసాల్లో అత్యంత అసౌకర్యాకార పరిస్థితులలో జీవనం సాగిస్తున్న 11మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వర్షాకాలం, ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా శాశ్వత గృహాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీవో తెలిపారు. చించోల్లీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమ పురోగతిని కూడా ఆమె సమీక్షించారు. 12 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, మరో 12 మందికి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో నిజమైన అర్హులను గుర్తించి ఒక కుటుంబం కూడా గృహ వసతి లేకుండా ఉండకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు., ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని, గృహ రహిత కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె అన్నారు. గ్రామంలో అర్హుల ఎంపిక, నిర్మాణాల పురోగతిని, లబ్ధిదారుల పరిస్థితులను ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సచిన్, గ్రామ సర్పంచ్ బస్సోల్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ అమ్ముల శేఖర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, అర్హులైన లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




