📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్హామీల అమలులో "కూటమి" చిత్తశుద్ధేది ? -పిఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులో జాప్యమెందుకు !...

హామీల అమలులో “కూటమి” చిత్తశుద్ధేది ? -పిఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులో జాప్యమెందుకు ! -రిలే దీక్షలో యుటిఎఫ్

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి24)బద్వేలు కూటమి ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి లేదని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్, ఏపీ జెఎసి బద్వేలు తాలూకా కన్వీనర్ నరసింహారెడ్డి విమర్శించారు.మంగళవారం ఉదయం ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పిఆర్సీని అమలు చేయాలని,ఆర్థిక బకాయిలను తక్షణం చెల్లించాలని,పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం తాలూకా కేంద్రాలలో రిలే దీక్షల కార్యక్రమంలో భాగంగా బద్వేలులోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్,ఏపీ జెఎసి బద్వేలు తాలూకా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలనిచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అధికారం చేపట్టగానే ఉద్యోగ,ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని,ఆర్థిక బకాయిలను రోడ్ మ్యాప్ ప్రకటించి ఆరు నెలలలోగా చెల్లిస్తామని,పెండింగ్ డిఏ లను విడుదల చేస్తామని, సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఆర్భాటంగా హామీలిచ్చారన్నారు. కూటమి నేతల మాటలు నిజమని నమ్మి కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఉద్యోగ,ఉపాధ్యాయులు సహకరిస్తే ఉద్యోగుల అండదండలతో గద్దెనెక్కిన కూటమి పెద్దలు ఉద్యోగుల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు.పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నదని,కనీసం ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ ను నియమించేందుకు ప్రయత్నించడం లేదని విమర్శించారు.గత వైసిపి ప్రభుత్వ హయంలో నియమించిన పిఆర్సీ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి ఏడాదిన్నర కాలం కావస్తున్నా పిఆర్సీ చైర్మన్ ను నియమించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నదని విమర్శించారు.ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలలో కేవలం 8500 కోట్ల రూపాయలను మాత్రమే చెల్లించి, బకాయిలన్నింటినీ చెల్లించామని ప్రకటనలు చేస్తున్నారన్నారు.ఉద్యోగులకు చెల్లించాల్సిన మిగతా 30 వేల కోట్ల బకాయిల సంగతేంటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. డిఏలు చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిన కూటమి పాలకులు మూడు డీఏలను పెండింగ్ లో ఉంచిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. ఉద్యోగ,ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు,పాత పెన్షన్ అమలు విధానంపై ఈ రెండేళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని పదేపదే ప్రకటించుకుంటున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయులు ప్రభుత్వంలో,ప్రజలలో భాగమనే విషయాన్ని మరిచినట్టున్నారన్నారు‌. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 12వ పిఆర్సిని ఏర్పాటు చేయడంతో పాటు పిఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని,ఆర్థిక బకాయిలతో పాటు పెండింగ్ డిఏలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏప్రిల్ 1, 2 తేదీలలో జిల్లా కేంద్రంలో,ఏప్రిల్ 15 నుండి 19 వరకు రాష్ట్ర కేంద్రంలో రిలే దీక్షలను చేపడతామని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ 28 తేదీ ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్.ఓబుల్ రెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ తాలూకా ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కె.నాగేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బండి జకరయ్య మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ,ఉపాధ్యాయులు గ్రాట్యుటీ,కమ్యుటేషన్ బకాయిల కోసం సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తున్నదన్నారు. సరెండర్ లీవ్ ల బకాయిలు నాలుగేళ్లుగా చెల్లింపులకు నోచుకోలేదని పేర్కొన్నారు. హెల్త్ కార్డు స్కీమ్ అటకెక్కిందని,మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు సైతం సకాలంలో చెల్లింపులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియమాకాలు చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం తగదన్నారు. మెమో 57ను అమలు చేయడంలో సాగదీత ధోరణి ఎందుకు ఆలంబిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులు ఆగ్రహిస్తే ఏమవుతుందో చరిత్ర చెబుతుందని,ఇప్పటికైనా పాలకులు తమ వైఖరిని మార్చుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దీక్షలకు ఎన్జీవోలు, పెన్షనర్స్ అసోసియేషన్,సిఐటియు,డివైఎఫ్ఐ,డాక్టర్స్ అసోసియేషన్,కవిపిఎస్, వైద్య,ఆరోగ్య సిబ్బంది సంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలియజేస్తూ సంఘీభావంగా దీక్షలలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు కె.సుధాకర్,కె.చెన్నయ్య,ఎ.డి.దేవ దత్తం,కె.ప్రసాద్, అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్ వీరదాసరి క్రిస్టఫర్,ఎన్జీవో అసోసియేషన్ తాలూకా సెక్రెటరీ జి.శివరామిరెడ్డి, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.పిచ్చయ్య,రామ సుబ్బారెడ్డి,డాక్టర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు రాజేష్ కుమార్,వైద్య ఆరోగ్య శాఖ అసోసియేషన్ నాయకులు వెంగయ్య,యుటిఎఫ్ నాయకులు ఎస్.దేవానందం,సి.కంచిరెడ్డి,ఎం.రామచంద్రయ్య,ఆర్.ఈశ్వరరావు, కొండయ్య,ఎ.లాజరయ్య, బి.ఓబన్న, వై.రామయ్య,ఎ.మేరి జయశీల,ఎస్.మున్నీ,ఉదయ్ కుమార్,ఆర్.రాజా,కె.క్రిష్ణయ్య,పి.వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular