అసలు దొంగలను వదిలి ఆటో డ్రైవర్‌పై కేసు… కుటుంబం ఆవేదన

తిరుమలాయపాలెం,ప్రజావాణి,మార్చి 11: మండలంలో ఇటీవల జరిగిన మోటార్ దొంగతనాల కేసులో అసలు నిందితులను వదిలేసి కేవలం ఆటో కిరాయికి వెళ్లిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.మండలంలోని బచ్చోడు తండాకు చెందిన గుగులోత్ శిరీష కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గత నెలలో బంధంపల్లి గ్రామానికి చెందిన కొన్ని బోరు మోటార్లు దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘటనలో సుమన్, దేవ్ సింగ్, రవి, రమేష్, ప్రసాద్ తదితరులు దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఆటో కిరాయికి కావాలని ఫోన్ చేయడంతో తన కుమారుడు నవీన్ ఆటోతో వెళ్లాడని, మోటార్ దొంగతనంపై అతనికి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.దొంగతనంలో అసలు నిందితులపై చర్యలు తీసుకోకుండా కేవలం ఆటో కిరాయి కోసం వెళ్లిన తన కుమారుడిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందని తెలిపారు.ఇక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు కానిస్టేబుల్ రామ్మూర్తి తమతో అనుచితంగా ప్రవర్తించాడని బాధితుడి తల్లి ఆరోపించారు. తన కుమారుడిపై కేసులు తొలగించాలంటే శారీరకంగా సహకరించాలని వేధింపులకు గురిచేశాడని కూడా ఆమె ఆరోపించారు. తాము ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతోనే తన కుమారుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉండగా, ఈ ఆరోపణలపై తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐని ఫోన్ ద్వారా సంప్రదించగా, మోటార్ దొంగతనాల కేసుపై విచారణ పూర్తయ్యిందని తెలిపారు. నిందితులు నేరం ఒప్పుకున్న తర్వాతే కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కేసు నుండి బయటపడేందుకు కొందరు పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారని, వారు ప్రస్తుతం జైలులో ఉన్నారని వెల్లడించారు.




